13, ఫిబ్రవరి 2012, సోమవారం

కవిత - 9

ఆలోచన

అలోచనలు అన్నీ
అనుభూతులకు నిదర్శనాలు
అలోచనలు అన్నీ
అనుభవరాహిత్య అప్రతిహతాలు
కొన్ని ఆలోచనలు
వ్యక్తం కాని వ్యర్థ సమాలోచనలు
కొన్ని ఆలోచనలు
వ్యక్త దార్శనిక, దిగ్దంతాలు
ఆలోచన ఒక్కటి
వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేసేది
ఆలోచన ఒక్కటి
ప్రాపంచిక జీవనంలో ఔన్నత్యాన్ని కలిగించేది
ఆలోచన
సన్నిహితులలో అజరామరం కలిగించేది
వ్యక్తమైన ఆలోచన
జీవన ప్రయాణంలో వెంట ఉండేది
నిత్యజీవితంలో
అనితర తరంగా సాగి, ప్రయాణం చేస్తుండేది.
*     *     *     *     *     *     *     *
ఆలోచన
ఒక ప్రేమ సామ్రాజ్యాన్ని జయించవచ్చు
ఆలోచన
ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేయవచ్చు
ఆలోచన
నూతన శకానికి నాంది
ఆలోచన
ఆధఃపాతాళానికి అవరోహణ అవుతుంది
ఆలోచనలు
గండు తుమ్మెదలై ఝంఝామారుతంలా సాగుతాయి
ఆలోచనలు
ప్రశాంత సాగరగర్భంగా ఉంటాయి
ఆలోచనలకు అంతులేదు
నిరంతర సహస్రాబ్దకెరటాలుగా
నిత్యచైతన్యంతో ప్రజ్వరిల్లి
జాతి జీవన నిర్మాణానికి ఉపయుక్తమయ్యే
ఆలోచనలకు పట్టాభిషేకం
ఆలోచనలకు కళ్యాణాభిషేకం.
మూసీ (సెప్టెంబర్ 2001)

9, ఫిబ్రవరి 2012, గురువారం

కవిత - 8

నేను

ఈ జీవన మార్గంలో
దేన్నీ తొందరగా వదలలేను
మనసులోకి ఆహ్వానిస్తాను
ఎద ఉంచి పరిశీలిస్తాను
ఔచిత్యం గురించి పరిశోధిస్తాను
భావ ప్రకటనకు ముందు
నా ఆలోచనలను విమర్శించుకుంటాను
ఎదుటి వ్యక్తి అంతరంగాన్ని
అంచనా వేయటానికి ప్రయత్నిస్తాను.
అనేకానేక విషయాలను క్రోడీకరించుకుంటాను
శబ్దాలను ఘనీభవింపచేస్తుంటాను
అక్షరతూణీరాలను సంధిస్తాను
ఇరు హృదయాల మధ్య వారధిని నిర్మిస్తాను
అసందర్భాలను అనౌచిత్యాలను
అప్రకటితాలుగా మారుస్తాను
గొంతుకలో గరళంలా దిగ్బంధిస్తాను
సమసమాజ నిర్మాణమే దిశగా పయనిస్తాను
ఈ జీవన మార్గంలో
దేన్నీ తొందరగా వదలలేను
జాతి నిర్మాణంలో
సౌభ్రాతృత్వ దిశగా
వివేచించి, మార్గగామి నవుతాను.

స్రవంతి (జనవరి - 2000)

7, ఫిబ్రవరి 2012, మంగళవారం

కవిత - 7

జలతారు ముసుగు

ఆత్మీయతకు ఆటంకం లేదు...
ఆటంకం అల్లా...
అంచనా వేయడంలోనే ఉంది
మన భావనలు
మన ఇష్టం అనుకుంటే సరిపోదు
మన ఆలోచనలు, సమాజ పరమైన పైన!
ఎదుటివాడికి నచ్చనపుడు...
ఆలోచనలు ఉత్తుంగ తరంగాలైనా
వాయులీన అయిననూ-
చిరు రంధ్రాన్వేషణకు ఒణికి పోతాయి
ఎక్కడి కక్కడ సర్దుకుపోవడం
ఎక్కాలతో పాటు ఉగ్గపోసుకోవాలి నేడు
ఎదుటివాళ్ల కొనవేళ్ళు తాకి
ఎదలను పండింపచేయాలి
హేక్ హాండ్స్ తృప్తిని కలగచేయాలి
మనసులోని ఆలోచనల తీవ్రతను
నిలువుగా చీల్చేయాలి
నిష్కల్మష హసనాన్ని అద్దుకోవాలి
అసంతృప్తిని మన డైరీలో భద్రపరచుకోవాలి
లేదా పరదాచాటున ఆర వేయాలి
ఇదేనా జీవితం అంటే చెప్పలేం...
ఆత్మీయతను ఎటునుండైనా అందించవచ్చు
ఆలోచనల రంగరింప చేయవచ్చు.

(స్రవంతి - మార్చి 2000)

6, ఫిబ్రవరి 2012, సోమవారం

కవిత - 6

నమ్మకం పడవ మీద

కాలంతో ప్రయాణిస్తున్న వాడిని
జన జీవనంలో నిత్యం మసులుతున్న వాడిని
జీవన మార్గంలో ఎదురు అవుతున్న ప్రతి వారిని
నమ్మకం అనే అర్థంలో నుండి పరికించాల్సిందే కదా!
మల్లెపువ్వులాంటి దుస్తుల్లో
మలినమైన మానవత్వం ఉంటుందని భావించగలమా?
సన్నజాజి లాంటి వ్యక్తిత్వం
దుర్గంధం వెదజల్ల గలదని భావించగలమా?
రోల్డుగోల్డు ఫ్రేములతో మేరునగ ధీరులు
చతురంగా నమ్మకంగా వత్తాసు పలికిన మాటల్లో
మంచికి బదులు వంచన మాటల గారడీ ఉందని తలచగలమా?
వినమ్రతను ప్రదర్శిస్తూ, విలువను రెట్టింపులు చేస్తూ
వివశులను చేస్తూ, మృదుభాషణలను అందించిన పదాల్లో
వెర్రి ఆలోచనలు, వెకిలితనం పరాకాష్టలో ఉందని
పెద్దమనిషి చాటులో వెధవ మనసుందని వివేచన చేయగలమా?
అద్దాల షోకేసుల్లో అతికించబడిన ఈ మనుష్యుల
ఆలోచనల ఊహలను అందుకోగలమా?
అయినా ...
ఏ పుట్టలో ఏమున్నదో ...
ఏ మనసు (మనిషి)లో ఏముందో అని
ప్రతి అంగవస్త్రాన్ని
ప్రత్యూషంగా ‘నమ్మకం’ అనే పదంతో
ప్రవీక్షించడమే ...
మన జీవన ప్రమాణం
నమ్మకం అనే పడవ మీద ప్రయాణమే!

(డిసెంబర్ 1999)

5, ఫిబ్రవరి 2012, ఆదివారం

కవిత - 5

తికమక

చెంగు చెంగున గంతులేస్తున్న హరిణంలా
అమ్మ ఒళ్ళో గారాలు పోతున్న లేగలా
భవిష్యత్తును బడిపంతుల చేతుల్లో
భద్రపరచిన కౌమారంలా
బాధ్యత లెరుగని విద్యార్థికి
అధికారుల - అలసత్వం
అహంభావం పంజా విప్పి ...
పుచ్చిపోయిన మెదళ్ళలోంచి
‘జంబ్లింగ్’ అనే చెదపురుగు
భయవిహ్వలతను కలిగించింది.
కేంద్రం కేంద్రానికి తన ఉనికి ఎక్కడంటూ
పిల్లి ఏడిండ్లు తిప్పినట్టుగా
పరీక్షను పక్కకు నెట్టి
పరీక్షా కేంద్రానికి తిరగడంతోనే
మదిలోని సారమంతా
మాయమై ... మసిగుడ్డయై
అక్టోబరుకు దారిని వెతుక్కోమంటుంది.
మరి ఈ బాధ్యతా రాహిత్యానికి
మహర్షి ఎవరు?
ఈ అనాలోచిత కార్యానికి
నష్టపూచీ ఎవరు?
అధికారులా ... యంత్రాంగమా?
తల్లిదండ్రులా ... విద్యార్థులా?
ఎవరైనా ...
అరిటాకు విద్యార్థే కదా!

(ఏప్రిల్ 1998)

4, ఫిబ్రవరి 2012, శనివారం

కవిత - 4

నా ప్రయాణం

ప్రయాణం ఎప్పుడూ
నిలకడగా సాగదు
ఒడిదుడుకుల మధ్య
ఎత్తు పల్లాలలో
మునుగుతూ, తేలుతూ
సమస్యల కుహరాల్లో
కొట్టుమిట్టాడుతూ సాగుతుంటుంది
ప్రయాణంలోని సహచరి
నడకలు తడబడుతుంటే
నలుమూలలు మసకబారినట్టై
నడక ఓరిమిని కోల్పోతున్నది.
పథగామియైన నా జీవనంలో
పదపదాన బంధనమంథనాలే
పరకాయ ప్రవేశం చేయలేక
‘పద’ చిత్తుడనై ప్రమత్తుడ నవుతున్నాను
ప్రయాణంలో ఎదురైన
పిల్లదారుల మైత్రీబంధంలో
జీవనయానాన్ని మధురం చేసుకోవడం
మనసులోని పొరలలో భద్ర పరచుకోవడం
మమతను పంచి మనసు నిచ్చి
మహాయానం వైపు మరలుతున్నాను
ప్రయాణంలోని మైలురాళ్ళను
నా కాలనాళికలో భద్రపరచుకుంటున్నాను.

ప్రసారిక (ఫిబ్రవరి, 2007)
`సమజ్ఞ’ కవితా సంకలనం నుండి.

3, ఫిబ్రవరి 2012, శుక్రవారం

కవిత - ౩

కాంతి బావుటా!

జీవనంలోని
పంధాలు ఎన్నో ...
ఒక్కో జీవితము
ఒక జీవన గమనానికి
కాంతి ప్రస్తాన మవుతుంది
ప్రపంచ మార్గములో
అనేక ప్రవృత్తులు ...
ఒక్కో ప్రవృత్తికి వెలుగు బావుటాయై
ఒక విలక్షణతను నిలుపుకుంటాయి.
* * * * * * * *
దశకంఠుని జీవనంలో
వేదవతి మోక్షానికి వెలుగురాయిలా నిలిచింది
బోయవాని జీవితంలో
నీలమోహనుని పాలచాదనవేలు మోక్షగామియై నిలిచింది
కాలం చేసే మేధా సంపత్తులో
దక్షిణాఫ్రికా కలికి తురాయై నిలిచించి
భారతీయ విజ్ఞాన పరంపరలో
రవీంద్రుడు, జగదీశుడు వేగుచుక్కలై ...
స్వాతంత్ర్య సమరంలో
కాకతి రుద్రమ, ఝాన్సీలక్ష్మీబాయి
సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్
కదనరంగ ఉత్తుంగతరంగాలై
జాతి జీవనంలో వెలుగు బావుటాలైనారు.
* * * * * * * *
జాతి జీవనంలో
వెలుగు బావుటా లెన్నో ...
తెలుగు సాహిత్యాకాశంలో
అలనాటి సోమనాథుడి నుండి నారయ వరకు
ఈనాటి సంపత్తు నుండి శ్రీరంగని వరకు
సాహిత్యకారుల మదిలో క్రాంతిరేఖలై
సాకారాలు అయి నిలుస్తున్నారు.
* * * * * * *
చిఱుపాప సాధించిన చేష్టలకు
తల్లి పొందే అమలిన కాంతి
పాఠశాలలో పిల్లలు సాధించిన మెరిట్ లను
ప్రాపుతోన అభినందించిన
లేత హృదయం కలువ పూవవుతుంది
కాననంలో పయనించే వారికి
చేయూత దొరికిన
చేతికి లాంతరు దారి చూపినట్లు
నిద్రాణమైన జీవనానికి
ఓదార్పు ధృవతారలా నిలుచు
ఎదురుచూపులు లేకుండా
పతి ప్రత్యక్షమైనపుడు
సతి కళ్ళలోని జిలుగు వెలుగులు
సంకీర్తించ తరమా!
* * * * * * *
కార్యాలయ భేతాళమున
కాకారాయుళ్ళ బారిన పడకుండా
కాలాతిక్రమమున కవకాశం లేకుండా
కార్యాధీశుని మెప్పు లొంది
క్షణాలలోన వింత కాంతి
అనుభూతి నిచ్చు
కాలవ్యవధి కంటె ముందే
కామికతో ఫలితాన్ని సాధించి
ప్రభుతతో మన్నన పొందినప్పుడు
శ్రమజీవుల కళ్ళలోని వెలుగు
ప్రపంచాన్ని జయించినంత
అందుకే ...
మేరా మహాభారత్ మహాన్
వెలుగులీను జీవితమంతా.

(26 - 3 - 2007)