31, జనవరి 2012, మంగళవారం

నీలమోహనాష్టకం (వచనపద్యాలు) - 8

 8
మధురం నీ నామామృతం
మధురం నీ గానామృతం
మధురం నీ వీక్షణామృతం
మధురం నీ కరుణామృతం

డాంబికాల బరువులతో డస్సిన ఈ బ్రతుకులో
ఆర్తి హరా! నీ చూపుల పలకరింపు లెన్నడో?

ఆలోచన కందని అందమా! గోవింద స్పందమా!
ఈ బ్రతుకున నీ చిరునవ్వులు చిమ్ముట ఎప్పుడో?
* * * * * * * * * 

పీతాంబరా! గోకులము ముంగిట ముత్యమా!
ఈ ‘రంగ’ని అంతరంగమును హృదయంగమము జేయరా!
ఈ భావ బీజాలను నీ హృదయాన రంగరింతు
నీవుదప్ప నాకు అన్యులెవరురా? శరణు! శరణు!!

"సర్వం శ్రీకృష్ణార్పణ మస్తు!"

30, జనవరి 2012, సోమవారం

నీలమోహనాష్టకం (వచనపద్యాలు) - 7

 7

నా కన్నులు నిరతము ఎండిన చీకటి నేలలై
నీ కన్నులు నిరతము దయావార్షుకాభ్రములై

నా హృదయమ్మున అనవసర ప్రయాసలై నిత్యము
నీ హృదయమ్మున మము బ్రోచే ఊహలే నిత్యము

నా బుద్ధిలోన నిరతము వెలితి వెలితి వెలితి
నీ బుద్ధిలోన నిరతము నిండారిన ధర్మాధృతి

నీ సన్నిధిలోన నిత్యము నేనిక నిలువగలుగు టెప్పుడో
నా అనుభవ కాసారాంత‘రంగ’మున నీ మునుగుట ఎన్నడో.

29, జనవరి 2012, ఆదివారం

నీలమోహనాష్టకం (వచన పద్యాలు) - 6

6
అలనాటి కుచేలుని కయ్యా! నే వారసుడను
కానీ నీ ఆప్యాయత కింతయు నోచుకోను
ఆయన అచ్చంపు భక్తి మోయరాని బరువైనది
అవ్యాజమ్మయిన ప్రేమ సవ్యాజ మ్మయిపోయినది
పారము కనరాని దివ్య కరుణావారధివి, నిన్ను
కనవలె నను కోర్కె మాత్ర మొకటే మిగిలినది
ఇక ఏమీ అడుగబోను, ఇక ఏమీ వేడబోను
ఈ ‘రంగ’ని బతుకున కనుపించవే ఒక్కసారి!

28, జనవరి 2012, శనివారం

నీలమోహనాష్టకం (వచన పద్యాలు) - 5


5
నీయెడ ఋజువుగ నా మనసు నల్లుదమన
అష్టవంకరులుగ కుబ్జగ అయిపోతున్నది

నా హృదయమును స్వచ్ఛపరచి అర్పించుదమన
కమ్ముకొన్న తమము సుంతయైన తొలగకున్నది

నీలివెలుగులందు మునిగితేలుదమన
అడుగడుగున చీకటి నదు లడ్డుకొంటున్నవి

మాయ కాదు మిథ్య కాదు అడ్డులేని దారి లేదు
ఈ ‘రంగ’ని గుంజుకొనవె నీ పాదాల కడకు.

27, జనవరి 2012, శుక్రవారం

నీలమోహనాష్టకం (వచన పద్యాలు) - 4

 4

మబ్బును గని ఆటాడగ నేను మయూరమ్మునా?
చందమామ వెలుగులకై ఎగిరే ఆ చకోరమ్మునా?

ఆమనిలో చివురు మేసి పాటపాడు కోకిలనా?
ప్రతి నిమిషము ‘కృష్ణ! కృష్ణ!’ అని పలికే చిలుకనా?

ఏమికాను ఏమికాను ఈ బతుకింకేమి కాను
ఎన్నాళ్ళని ఊరుకోను ఏమని నీదరికి రాను

ఏమి చేసినా నీవే, ఏమి చేయకున్నా నీవే
ఈ ‘రంగ’ము శ్రీరంగము చేయవలసినది నీవే!

26, జనవరి 2012, గురువారం

నీలమోహనాష్టకం (వచన పద్యాలు) - ౩


3
 
నీలమోహనా! నిను చేరుటకై యాతన మనశ్శరీరముల
నీ రూపం కోసం నా కన్నులు వాకిళ్ళయినయి

తపిస్తున్నది శ్రవణేంద్రియం నీ వేణుగానం కోసం
నీ నామస్మరణ కోసం అనునిత్యం ఆత్మకు తపన

కనులకు కనపడదేమీ నీ మనోజ్ఞ రూపం
వినపడవేమీ నీ పదధ్వనులు నా అంతరంగాన

ఆలోచనాలోచనాలు అనేకమయి, నీలవర్ణుని
అర్థ మెరుగడు ఈ ‘రంగ’డు తదన్యుడయి.

25, జనవరి 2012, బుధవారం

నీలమోహనాష్టకం (వచనపద్యాలు) - 2



2

నీ పదముల చిరుగజ్జెల సవ్వడి తలపులు
నా మనసుకు సుంతగూడ నిశ్శబ్దత కలిగించవు

బుడుబుంగ వంటి నిన్ను చూడాలను కోర్కెలు
నా కన్నుల కొంచెమైన మూతబడనీయవు

అందకుండ పోయే నిన్నందుకొనెడు ఊహలు
నా కాళ్ళను కదలనీయవు మెదలనీయవు

నీలి నీలి వెల్గుల దొరా! నింగి పొంగులైన దొరా!
‘రంగ’ని నేవేమి చేయదలతువో, తెలియనీయవురా.

23, జనవరి 2012, సోమవారం

నీలమోహనాష్టకం (వచన పద్యాలు) - 1


మోహనవంశీ భావ భూమికనై
నీలిరాగమున మనసు ముమ్మడుగులై
విశ్వనాధ కృష్ణ భావనల ఊపిరులూది
‘సుప్రసన్న’ కృష్ణ బీజాక్షరిలో ‘సంపత్తు’ నైతి.

1
నీలమోహనా నిను చేరుటకై యాతన మనశ్శరీరముల
నీ రూపం కోసం నా కన్నులు వాకిళ్ళయినయి
తపిస్తున్నది శ్రవణేంద్రియం నీ వేణుగానం కోసం
నీ నామస్మరణ కోసం అనునిత్యం ఆత్మకు తపన.
కనులకు కనపడదేమీ నీ మనోజ్ఞ రూపం
వినపడవేమీ నీ పద ధ్వనులు నా అంతరంగాన
ఆలోచనాలోచనాలు అనేకమయి, నీలవర్ణుని
అర్థ మెరుగడు ఈ ‘రంగ’డు తదన్యుడయి.