2, ఫిబ్రవరి 2012, గురువారం

కవిత - 2

సునామీ నీవెంత?

మనిషి మనిషికీ అంతరం
తరంగ - తరంగం కున్నంత
జీవన వైవిధ్యమంతా
ఈ తరంగం ... తరంగం మధ్య వ్యవధిలోనే
జీవనంలో కుదుపు
ఒక్కొక్కసారి తేరుకోలేనంత అగాధం ఏర్పరుస్తుంది.
మనిషి ఆలోచనలు సముద్రమంత
ఆ సముద్రం లోతున ఎన్ని అదృశ్య భావనలో ...
మనిషి నిత్యనైమిత్తికంగా
మనుగడ సాగిస్తున్నా ...
మనసు నిండని ఆలోచనలు ఎన్నో ...
అవి సముద్రమంత విశాలం ...
సముద్రంలోని కెరటాలు ...
నిశ్శబ్దీకరించుకొనినట్టే
మానవుడి అంతరంగం కూడా అదృశ్యమాన మవుతుంది
కెరటం ... కెరటం కూడబలుక్కొని
సముద్రుడికి తెలియకుండా
సునామీ రూపంలో ముంచెత్తి
దేశాన్ని దగా చేసినట్టు
మానవుని ఆలోచనలు ఏకమై
సాటి మానవులను నాశనం చేస్తున్నాయి
మరి ...
సునామీ ... అప్పుడు నీ వెంత?


25-12-2005
(‘సమజ్ఞ’ కవితా సంకలనం నుండి)

కామెంట్‌లు లేవు: