1, ఫిబ్రవరి 2012, బుధవారం

కవిత - 1

మా అమ్మ

అమ్మ ఉమ్మసంచిలో నున్నప్పటినుండే
అమ్మ కనురెమ్మై
నవవిధాల బాధల ననుభవిస్తూ
నవోన్మేష భావనను పొందుతూ
జీవన్మరణ సమస్య నధిగమించి
బాలింతై, తను పసిపాపై, బాలబువ్వై
నా అడుగులో తను అడుగై
జీవన చుక్కానికి తెర చాపయైంది
మా అమ్మ తొలి అక్షరమైంది
తన జీవనమంతా నా ఎదుగుదలకే ధారపోసింది
తన ఆశలను, ఆకలిని త్యాగం చేసి
కడుపు ప్రేగు కొరకు పాకులాడింది
బిడ్డ వేసే ప్రతికదలికపై
బిక్కు ... బిక్కు మంటూనే భవిష్యత్తును కాంక్షిస్తుంది
తన బిడ్డ .. తాతైనా ...
తనువంతా కళ్ళు చేసుకొని ఎదురుచూస్తుంది
అందుకే ... మా యమ్మ
నిలువెత్తు ఆత్మీయతావృక్షం
జీవించటం నాదైనా ...
జీవనగానం అమ్మదే ...
పొత్తి కడుపులో ఉండగా
నా రోదన తనదిగా చేసుకొని
తడబడు అడుగుల్లో
తన పాదాల అడుగుజాడల్లో జాగ్రత్తగా
తన పని తాను చేసుకుంటూనే
తనువెల్ల కళ్ళు చేసుకొని
నా కదలికను గమనిస్తూ, జాగ్రత్త పడిన అమ్మ
నా అక్షరాలలో గవాక్షరమై
నా స్వరంలో తను కోయిలయై
జీవితానికి చుక్కానియైంది
నా అర్తిని సంపూర్ణం చేయటానికి
తను అర్ధానుస్వారమైంది
ఎదిగిన వయస్సులో
అమ్మ ఒడిలో తల పెట్టుకోలేము కాని
గుండెలోతుల్లోని
అమ్మ హృదయంలో తలదాచుకోగలం
‘అమ్మ’ ఒక కమ్మని చైతన్యం.


(‘సమజ్ఞ’ కవితా సంకలనం నుండి)