13, ఫిబ్రవరి 2012, సోమవారం

కవిత - 9

ఆలోచన

అలోచనలు అన్నీ
అనుభూతులకు నిదర్శనాలు
అలోచనలు అన్నీ
అనుభవరాహిత్య అప్రతిహతాలు
కొన్ని ఆలోచనలు
వ్యక్తం కాని వ్యర్థ సమాలోచనలు
కొన్ని ఆలోచనలు
వ్యక్త దార్శనిక, దిగ్దంతాలు
ఆలోచన ఒక్కటి
వ్యక్తిత్వాన్ని ప్రకాశింపచేసేది
ఆలోచన ఒక్కటి
ప్రాపంచిక జీవనంలో ఔన్నత్యాన్ని కలిగించేది
ఆలోచన
సన్నిహితులలో అజరామరం కలిగించేది
వ్యక్తమైన ఆలోచన
జీవన ప్రయాణంలో వెంట ఉండేది
నిత్యజీవితంలో
అనితర తరంగా సాగి, ప్రయాణం చేస్తుండేది.
*     *     *     *     *     *     *     *
ఆలోచన
ఒక ప్రేమ సామ్రాజ్యాన్ని జయించవచ్చు
ఆలోచన
ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేయవచ్చు
ఆలోచన
నూతన శకానికి నాంది
ఆలోచన
ఆధఃపాతాళానికి అవరోహణ అవుతుంది
ఆలోచనలు
గండు తుమ్మెదలై ఝంఝామారుతంలా సాగుతాయి
ఆలోచనలు
ప్రశాంత సాగరగర్భంగా ఉంటాయి
ఆలోచనలకు అంతులేదు
నిరంతర సహస్రాబ్దకెరటాలుగా
నిత్యచైతన్యంతో ప్రజ్వరిల్లి
జాతి జీవన నిర్మాణానికి ఉపయుక్తమయ్యే
ఆలోచనలకు పట్టాభిషేకం
ఆలోచనలకు కళ్యాణాభిషేకం.
మూసీ (సెప్టెంబర్ 2001)

కామెంట్‌లు లేవు: