6, ఫిబ్రవరి 2012, సోమవారం

కవిత - 6

నమ్మకం పడవ మీద

కాలంతో ప్రయాణిస్తున్న వాడిని
జన జీవనంలో నిత్యం మసులుతున్న వాడిని
జీవన మార్గంలో ఎదురు అవుతున్న ప్రతి వారిని
నమ్మకం అనే అర్థంలో నుండి పరికించాల్సిందే కదా!
మల్లెపువ్వులాంటి దుస్తుల్లో
మలినమైన మానవత్వం ఉంటుందని భావించగలమా?
సన్నజాజి లాంటి వ్యక్తిత్వం
దుర్గంధం వెదజల్ల గలదని భావించగలమా?
రోల్డుగోల్డు ఫ్రేములతో మేరునగ ధీరులు
చతురంగా నమ్మకంగా వత్తాసు పలికిన మాటల్లో
మంచికి బదులు వంచన మాటల గారడీ ఉందని తలచగలమా?
వినమ్రతను ప్రదర్శిస్తూ, విలువను రెట్టింపులు చేస్తూ
వివశులను చేస్తూ, మృదుభాషణలను అందించిన పదాల్లో
వెర్రి ఆలోచనలు, వెకిలితనం పరాకాష్టలో ఉందని
పెద్దమనిషి చాటులో వెధవ మనసుందని వివేచన చేయగలమా?
అద్దాల షోకేసుల్లో అతికించబడిన ఈ మనుష్యుల
ఆలోచనల ఊహలను అందుకోగలమా?
అయినా ...
ఏ పుట్టలో ఏమున్నదో ...
ఏ మనసు (మనిషి)లో ఏముందో అని
ప్రతి అంగవస్త్రాన్ని
ప్రత్యూషంగా ‘నమ్మకం’ అనే పదంతో
ప్రవీక్షించడమే ...
మన జీవన ప్రమాణం
నమ్మకం అనే పడవ మీద ప్రయాణమే!

(డిసెంబర్ 1999)

కామెంట్‌లు లేవు: